తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు ఈ నెలలోపే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చాకేటి లస్మన్న, ఉద్యమకారుల రచయిత సంఘం కన్వీనర్ జాధవ్ పుండలిక్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.
ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని వెంటనే కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను గౌరవిస్తూ వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
హామీల అమలులో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుని, అమలు వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ ప్రకటన ఉద్యమకారులలో ఆశాభావాన్ని నింపింది.


