వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, రేషన్ కార్డుదారులకు మూడు నెలల సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందించాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ సూచనలు జారీ చేసింది.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వేసవి కాలంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికి పైగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నట్లు అంచనా. కేంద్రం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని సూచించడంతో, రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన బియ్యం నిల్వలు మరియు పంపిణీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
గతంలో మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈసారి కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా, బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం డీలర్లకు ప్రధాన సమస్యగా మారింది. అలాగే, మూడు నెలలకు గాను మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి రావడం, సర్వర్ సమస్యలతో పంపిణీ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.


