తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 10 లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారులు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేశారు. ఈసారి ప్రతి పేపర్‌ను రెండుసార్లు మూల్యాంకనం చేయనున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సంబంధించిన కసరత్తును ఇంటర్ బోర్డు ముమ్మరం చేసింది. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకంగా ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో సాంకేతిక ప్రక్రియలు, కోడింగ్, డీకోడింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఇంటర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా, ఏప్రిల్ 10 లోపు విద్యార్థుల చేతికి మార్కుల జాబితా అందనుంది.
గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఇంటర్ బోర్డు ప్రతి పేపర్‌ను రెండుసార్లు మూల్యాంకనం చేసే కీలక నిర్ణయం తీసుకుంది. తుది ఫలితాల విడుదలకు ముందు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిగాకే ప్రకటన చేయాలని బోర్డు నిర్ణయించింది. మూల్యాంకన కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు, కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది.












