రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆర్థిక శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత చెల్లింపులను జూన్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన 754 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఒక్కో పిటిషన్లో ఒకటి నుండి పది మంది వరకు పిటిషనర్లు ఉన్నారని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో, ప్రతి పిటిషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ చెల్లించారో వివరాలతో కూడిన పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
“వాళ్ల డబ్బులు వాళ్లకే ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యం?” అని కోర్టు ప్రశ్నించింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితమైన వర్గమని, వారి జీవితాలతో చెలగాటం ఆడకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలని హెచ్చరించింది.
ఈ కేసు విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తూ, ఆలోపు అన్ని బెనిఫిట్స్ చెల్లింపులు పూర్తిచేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సమయానికి “ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదు” అని హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.








