తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జీపీఏఐ పథకం ద్వారా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల బీమా చెక్కును శనివారం అందజేశారు.
భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాతో పాటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జీపీఏఐ పథకంలో బీమా పొందారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న భార్య బొడిగంవార్ సుశీలకు రూ.20 లక్షల బీమా చెక్కును బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ సోనియా అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియదని, అలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి బీమా పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో రక్షణ పొందే అవకాశం ఉందని, ప్రతి ఖాతాదారుడు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేగాం గ్రామ సర్పంచ్ సుష్మా రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యామ్రావు పటేల్, మాజీ ఎంపీటీసీ మాణిక్రావు, వార్డ్ సభ్యుడు దిగంబర్ పటేల్, బ్యాంక్ ఫీల్డ్ అధికారి ఉదయ్, ఆర్ఎం నవీన్, ఎస్ఎంబీ విలాస్, సిఎస్ఎం సుధీర్, ఐకేపీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












