** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
స్వాతంత్య్రానంతర భారతదేశంలో కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి, నేటి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో జరుగుతున్న సామ్రాజ్యవాద దోపిడీపై ఐదు దశాబ్దాల క్రితమే హెచ్చరించారు. ఆయన 50వ వర్ధంతి సందర్భంగా, ఆయన జీవితం, పోరాటాలు, చారిత్రాత్మక ప్రకటనల గురించి ఈ కథనం వివరిస్తుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగష్టు 15న మద్రాస్ సెంట్రల్ జైల్లో ఉన్న సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు ఏ.కె. గోపాలన్, జైల్లోనే జాతీయ జెండా ఎగురవేసి తోటి ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని గుర్తించని జైలు అధికారులు, 'చట్టబద్ధంగా ఏర్పడిన బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన'ను కూలదోసేందుకు ప్రయత్నించారని, రాజద్రోహం నేరం కింద శిక్షాస్మృతిలోని 124 ఎ సెక్షన్ కింద విచారించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా గోపాలన్ జైల్లో గడపాల్సి రావడం మన చరిత్ర.
అదేవిధంగా, తరిమెల నాగిరెడ్డిని “యుద్ధమూ-దాని ఆర్ధిక ప్రభావం” పుస్తకం ప్రచురించినందుకు 1940లో శిక్షాస్మృతిలోని 121 ఎ, 120 బి సెక్షన్ల కింద నేరారోపణ చేసి ఏడాది జైలు శిక్ష విధించారు. మళ్ళీ అదే సెక్షన్ల కింద 1967లో నేరారోపణ చేసి మూడేండ్లపాటు జైల్లో నిర్భందించారు. మధ్యలో మరో ఎనిమిదిసార్లు ఈ వలసవాద చట్టాల కిందే వివిధ సందర్భాల్లో అరెస్టు చేశారు. తరిమెల నాగిరెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా, ముఖ్యమంత్రి రాజగోపాలాచారి హయాంలో పనిచేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ, కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కాగా ప్రతిపక్షనేతగా నాగిరెడ్డి కొనసాగారు.
1954 చివర్లో మధ్యపాన నిషేధం బిల్లుపై ఓటింగ్‌లో అధికారపక్ష సభ్యులైన శంకరరెడ్డి, సుబ్రమణ్యేశ్వర రావులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం ఓడిపోయి ప్రకాశం పంతులు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో సమాన బలం ఉన్న కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అంటే దాని నాయకుడైన తరిమెల నాగిరెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేపట్టమని ఆహ్వానించాలి. కానీ, పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన నాటి గవర్నర్ త్రివేది ఆ పని చేయలేదు. ప్రధానిగా ఉన్న నెహ్రూ కూడా దానికి సుముఖంగా లేరు.
1957 రెండవ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు, 1962, 1967లలో శాసనసభకు ఎన్నికయ్యారు. 1962లో తిరిగి అదే పుట్లూరులో అదే అభ్యర్థిపై పోటీ చేసి గెలిచాడు. పార్లమెంటులోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఋషివ్యాలీ, మద్రాసు లయోలా కాలేజీల్లో విద్యాభ్యాసం తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంకి వెళ్లారు. అనేకమంది జాతీయ నాయకులకు ఆలవాలమైన ఆ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్‌కి అధ్యక్షునిగా ఎన్నికై, ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయునిగా గుర్తింపు పొందారు. విశ్వవిద్యాలయంలో చేరేనాటికి గాంధీవాదిగా ఉన్న నాగిరెడ్డి విద్య పూర్తయ్యే నాటికి కమ్యూనిస్టుగా మారారు.
శ్రీకాకుళం గిరిజనులపై భూస్వాములు, ప్రభుత్వ తాబేదార్లు చేస్తున్న దోపిడీని, దౌర్జన్యాల్ని భరించలేకపోయిన నాగిరెడ్డి, శాసనసభ్యుడిగా ఉండి వారికి ఏమాత్రం సహాయపడలేకపోయానని తన అశక్తతను నిందించుకుని, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1969 మార్చిలో రాజీనామా చేసి “ప్రజల్ని విప్లవ కార్యాచరణకు కదిలించటమే తన కర్తవ్యంగా” ప్రకటించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో కృష్ణా జిల్లా అట్ల ప్రగడలో తన సహచరులతో సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నందుకు అక్టోబరులో మద్రాసులో అరెస్టు చేసి “కుట్రకేసు” బనాయించారు. “నాగిరెడ్డి కుట్రకేసు”గా ప్రఖ్యాతిగాంచిన ఈ కేసు, స్వతంత్ర భారతదేశంలో పెట్టిన తొలి కుట్రకేసు. సుదీర్ఘ విచారణ అనంతరం మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.












