ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసు విచారణలో 'సూర్య భాయ్' అలియాస్ పల్లాపు సురేష్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. తాను ధనవంతుడైన 'గోల్డ్ మ్యాన్' అని చెప్పుకుంటూ, నకిలీ నగలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కొండా విజయ్ కుమార్ కేసులో భాగంగా విచారణకు పిలిచిన సూర్య భాయ్, మొదట తాను ధరించిన 12 రకాల ఆభరణాల విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారుల ముందు ప్రగల్భాలు పలికాడు. అయితే, ఐటీ శాఖ వాల్యూయర్లు పరీక్షించగా, ఆ నగలు కేవలం 3 లక్షల రూపాయల విలువైనవని, వాటిలో చాలా వరకు నకిలీవని తేలింది.
విచారణలో, సూర్య భాయ్ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తాను ధనవంతుడినని చెప్పుకోవడానికి దాదాపు 32 రకాల నకిలీ నగలను మార్చి మార్చి వాడేవాడని అధికారులు గుర్తించారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా 'గోల్డ్ మ్యాన్' గా కలరింగ్ ఇచ్చేవాడని వెల్లడైంది.
అతని ఆర్థిక రికార్డులను పరిశీలించగా, ఆ బిల్డప్‌కు తగ్గట్టుగా ఆదాయం లేదని స్పష్టమైంది. గత ఆరేళ్లలో కేవలం ఒక ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 4.9 లక్షల ఆదాయం చూపాడు. జిమ్ ట్రైనర్‌గా, చికెన్ షాప్ యజమానిగా ఈ ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అతని పేరు మీద ఎలాంటి స్థిరాస్తులు లేవని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.
అతని వద్ద ఉన్న కార్లు, బైకులు ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్మెంట్లలో వచ్చే కమిషన్లతో కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే, అతను నడుపుతున్నట్లు చెప్పుకునే ఫౌండేషన్, వృద్ధాశ్రమానికి ఎలాంటి రిజిస్ట్రేషన్, పాన్ కార్డు లేవని తేలింది. సినిమాల్లో అవకాశాల కోసం, అందరి దృష్టిని ఆకర్షించడానికే ఇలా చేసినట్లు సూర్య భాయ్ అంగీకరించాడు.








