ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు మానసిక బలంతో పరీక్షలకు సిద్ధం కావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ సూచించారు.
శుక్రవారం స్థానిక వికాస్ హైస్కూల్లో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్ష అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరీక్షలంటే విద్యార్థులు భయపడవద్దని, మానసిక సంసిద్ధతతో పరీక్షలను ఎదుర్కోవాలని అన్నారు. చదువుపై శ్రద్ధ చూపుతూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
పరీక్షలకు వెళ్లేముందు కొంతసేపు మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని పేర్కొన్నారు. హడావిడిగా వెళ్లకుండా పరీక్షలకు అవసరమైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు.
పరీక్షల సమయంలో బజారులో లభించే తినుబండారాలు తినకుండా ఉండాలని, అవసరమైతే పండ్ల పానీయాలు తీసుకోవడం మంచిదన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికంగా నీరు త్రాగాలని, ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
పరీక్షలు విద్యార్థి జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రశాంతంగా ఉంటే పరీక్షలు సజావుగా రాయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


