నకిలీ పాస్‌పోర్ట్ కేసులో విచారణ పేరుతో బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ సంపత్ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలతో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం జైలు నుంచి విడుదలైన సదరు వ్యక్తి, కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకుండా ఉండటానికి సీఐ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ కలిసి మొత్తం రూ.15 లక్షలు డిమాండ్ చేశారు.
బాధితుడు మొదట రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ, మొదటి విడతగా రూ.2 లక్షలు ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో, ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలోని బృందం వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఈ దాడులు మంగళవారం సాయంత్రం మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగాయి. లంచం తీసుకున్న సీఐ, ఎస్సైలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ లంచం వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజా భద్రతకు బాధ్యత వహించాల్సిన పోలీసులే ఇలా లంచాలకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.











