షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల పదవుల ప్రక్షాళనపై అసంతృప్తి వ్యక్తమైంది. గతంలో సేవలందించిన నాయకులకు సమాచారం లేకుండా, కార్యకర్తల అభిప్రాయం తీసుకోకుండా నూతన అధ్యక్షుల ఎంపిక జరగడం సరైన పద్ధతి కాదని షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య విమర్శించారు.
తనతో పాటు పార్టీకి సేవలు అందిస్తున్న నాయకులను ప్రక్షాళన పేరుతో తొలగిస్తున్నారన్న ప్రచారం ఆవేదన కలిగిస్తోందని చెన్నయ్య అన్నారు. తాను పార్టీలో దీర్ఘకాలంగా వివిధ హోదాల్లో సేవలందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1988-89లో యువజన కాంగ్రెస్ లో చేరి, ఆ తర్వాత పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా, ఎంపీటీసీగా, మండల పరిషత్ వైస్ చైర్మన్ గా, గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా, మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పనిచేశానని తెలిపారు.
నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల మధ్య షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలుపునకు కృషి చేశానని పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు క్రమశిక్షణతో పనిచేశానని, గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీకి నమ్మకంగా ఉన్నానని తెలిపారు.
స్థానిక నాయకుల నుండి భరోసా లభించినా, ఇప్పుడు ప్రక్షాళన పేరుతో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా తమను పదవుల నుండి తొలగించడం సరికాదని చెన్నయ్య ప్రశ్నించారు. పార్టీకి సేవ చేసిన వారి పట్ల కనీస గౌరవం పాటించాలని, సమన్వయ కమిటీల పేరుతో ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి మంచిది కాదని సూచించారు. అధిష్టానానికి నివేదికలు పంపడం పూర్తిగా ఏకపక్షం అవుతుందని, కొత్తూరు విషయంలో వైఖరిలో తేడా ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.












