అలేరు, 2026-07-17
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ)లో ప్యానల్ ఉద్యోగులుగా పనిచేసి, 1997లో అకస్మాత్తుగా తొలగించబడిన సుమారు 2000 కుటుంబాలు 29 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాయి. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, హైకోర్టు తీర్పులను అమలు చేయాలని ఎస్.బి.ఐ సెలెక్టెడ్ పానెల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె అజ్మీర్ షా, కార్యదర్శి ఎల్.ఎం విజయ్ కుమార్ శుక్రవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ)లో ప్యానల్ ఉద్యోగులుగా పనిచేసిన తమకు 29 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని ఎస్.బి.ఐ సెలెక్టెడ్ పానెల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె అజ్మీర్ షా, కార్యదర్శి ఎల్.ఎం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ, 1997 మార్చి 31న ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుండి తొలగించారని, నాటి నుండి 2000 కుటుంబాలు బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్.బి.ఐ ప్యానల్ ఉద్యోగుల సమస్యపై గౌరవ హైకోర్టు మూడు పర్యాయాలు 1998, 2005, 2014లో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ప్యానల్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యం ఆ తీర్పులను బేఖాతరు చేస్తోందని వారు విమర్శించారు. మాకు అనుకూలంగా మూడుసార్లు కోర్టు తీర్పునిచ్చిన ఎస్బిఐ యాజమాన్యం ఎందుకు న్యాయం చేయడం లేదో అని ప్రశ్నించారు. ఎస్బిఐ సంస్థ మహాసముద్రమని అందులో మేము ఎంత..? న్యాయం మా పక్కనే ఉంది కాబట్టే పోరాడుతున్నామని తెలిపారు.
1997కు ముందు 15 ఏళ్ల సర్వీసు, ఆ తర్వాత 29 ఏళ్ల నుండి న్యాయం కోసం పోరాటం చేసి చేసి జీవితంలోని 44 ఏళ్లను బ్యాంకు కోసమే అంకితం చేశామని ఉద్యోగులు వాపోతున్నారు. 1997లో రాష్ట్రవ్యాప్తంగా 2,000 మంది ప్యానల్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 1,200కు చేరిందని, ఇందులో చాలామంది వయస్సు పైబడి మరణించారని తెలిపారు. బ్యాంకులో ఖాళీలు ఉన్నప్పటికీ, తమను కాదని అవుట్ సోర్సింగ్ ద్వారా కొత్తవారిని నియమించుకోవడం యాజమాన్య అన్యాయపూరిత విధానాలకు నిదర్శనమని వారు మండిపడ్డారు.
మా ప్రధాన డిమాండ్లు ఏమనగా, హైకోర్టు తీర్పుల మేరకు ప్యానల్ ఉద్యోగులందరికీ శాశ్వత జీవనోపాధి కల్పించాలని, 1997 నుండి 2026 వరకు నష్టపరిహారం చెల్లించాలని, విధుల్లో చేరకుండానే మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు సహకరించాలని, ఎస్.బి.ఐ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురావాలని, మా ఉద్యోగస్తులు అందరికీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్యనారాయణ రావు, కె.వి రమణయ్య, ఎస్.కె సాధిక్, యు. ఏడుకొండలు, సి.హెచ్ శ్రీనివాసులు, ఏం.వి నరసింహులు, ముత్తయ్య, ఎల్లం విజయకుమార్, కె.వి రమణయ్య, ఏం బాబురావు తదితరులు పాల్గొన్నారు.












