నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో 'టీమ్ గరుడ' ఆధ్వర్యంలో బాజా ఎస్ఏఈ ఇండియా వాహనం, ఐఎస్ఎన్ఈఈ గోకార్ట్ 3.0 వాహనాలను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంకేతిక ప్రతిభకు ఈ ప్రాజెక్టులు నిదర్శనంగా నిలిచాయి.
RGUKT బాసర మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, ఎస్ఏఈ ఇండియా ఆర్జీయూకేటీ-బి కొలీజియట్ క్లబ్ సహకారంతో ఈ వాహనాలను రూపొందించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కచ్చితమైన డిజైన్, నిర్మాణ నైపుణ్యంతో ఈ వాహనాలు అభివృద్ధి చేయబడ్డాయి.
ఈ ఆవిష్కరణోత్సవానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎ. గోవర్ధన్, ఓఎస్డీ ఇ. మురళీ దర్శన్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఆర్&డీ హెడ్ డాక్టర్ హనుమాన్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వైస్ ఛాన్సలర్ ఎ. గోవర్ధన్ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఈ వాహనాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా వాహనాన్ని నడిపి పరిశీలించారు.
ఓఎస్డీ మురళీ దర్శన్, సింప్లిఫోర్జ్ ప్రతినిధులు విద్యార్థుల కృషిని, అధ్యాపకుల మార్గనిర్దేశాన్ని కొనియాడారు. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని తెలిపారు.

