ప్రభుత్వం అందిస్తున్న మోడల్ స్కూల్, గురుకుల, మైనారిటీ విద్యాసంస్థలలోని ఉచిత విద్యా అవకాశాలను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఎస్యూఐ నాయకులు శశి కుమార్, తల్లా సుమంత్ పిలుపునిచ్చారు. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది.
ఎన్ఎస్యూఐ ముధోల్ నియోజకవర్గ నాయకుడు శశి కుమార్ మరియు ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి తల్లా సుమంత్ మాట్లాడుతూ, మోడల్ స్కూల్, గురుకుల, మైనారిటీ విద్యాసంస్థలలో ఉచిత విద్యను విద్యార్థులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
2026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల విద్యాలయాల ప్రవేశ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా అందిస్తారని తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మోడల్ మరియు గురుకుల విద్యాసంస్థలు గొప్ప వరమని, ఈ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని వారు పేర్కొన్నారు.
ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని, మోడల్ స్కూల్ మరియు మైనారిటీ విద్యాసంస్థల దరఖాస్తులకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో మీ సేవ కేంద్రాలు లేదా ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

