బాసర, 2026-05-17
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), త్రిబుల్ ఐటీ బాసరలో నిర్వహించిన విద్యా వారోత్సవ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాలు ఫోర్బ్స్ ప్రపంచ రికార్డుల పుస్తకంలో స్థానం సంపాదించగా, ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), త్రిబుల్ ఐటీ బాసరలో మే 11 నుండి 17 వరకు నిర్వహించిన విద్యా వారోత్సవ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాలు ఫోర్బ్స్ ప్రపంచ రికార్డుల పుస్తకంలో స్థానం సంపాదించగా, ప్రపంచ ప్రఖ్యాత ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం అత్యంత వైభవంగా, వినూత్నంగా నిర్వహించి ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది.
వివిధ రంగాల్లో కార్యక్రమాలు
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవరాజు సమర్థవంతమైన పర్యవేక్షణలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని వారాంతం పొడవునా విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి విభిన్న రంగాల్లో అత్యధిక సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టారు. విద్యా వారోత్సవంలో భాగంగా నాణ్యమైన విద్య, జాతీయ అంచనా, గుర్తింపు మండలి అవగాహన, ఆరోగ్య పరీక్షలు, వెల్నెస్ కార్యక్రమాలు, యోగా, మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, హరితహారం, నీటి సంరక్షణ, శుభ్రత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత, ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన
ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, అవగాహన ర్యాలీలు, పోస్టర్ ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు, పర్యావరణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు.
సమిష్టి కృషికి నిదర్శనం
విద్యా, ఆరోగ్యం, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, సామాజిక బాధ్యత, విద్యార్థుల సంక్షేమం వంటి అనేక రంగాలను సమన్వయం చేస్తూ అత్యధిక సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించిన విద్యాసంస్థగా ఆర్జీయూకేటీ- త్రిబుల్ ఐటీ బాసర ఈ విశిష్ట గుర్తింపును సాధించింది. ఈ ఘనత విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.
వైస్-చాన్సలర్ ప్రశంసలు
ఈ సందర్భంగా ఆర్జీయూకేటీత్రిబుల్ ఐటీ బాసర వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా, సృజనాత్మకంగా నిర్వహించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఫోర్బ్స్ ప్రపంచ రికార్డుల పుస్తకంలో స్థానం దక్కడం, అలాగే ది వాషింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమవడం విశ్వవిద్యాలయ విద్యా నాణ్యతకు, సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు.












