జగిత్యాల జిల్లాలో ప్రేమ పేరుతో జరిగిన మోసం, ఒక బాలిక మృతికి దారితీసింది. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరుసకు చెల్లెలైన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దుర్వినియోగం చేసిన యువకుడి చర్యలతో మనస్తాపానికి గురైన బాలిక, మూడు నెలల పోరాటం తర్వాత మృతి చెందింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అదే గ్రామానికి చెందిన కోల మనోజ్ అనే యువకుడు, బాలికతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు. బాలికను, ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా, మనోజ్ నిరాకరించి అవమానించినట్లు సమాచారం.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక, గత ఏడాది డిసెంబర్ 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మూడు నెలల పాటు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించింది.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు, పోలీసులు కోల మనోజ్‌పై పోక్సో చట్టం, అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.


