నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన సారంగ శ్రీనివాస్ (44) పై కోతులు ఒక్కసారిగా గుంపుగా దాడి చేయడంతో చేతులు, కాళ్లు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పెరుగుతున్న కోతుల బెడద
ఇటీవల గ్రామాల్లో కోతుల సంచారం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల సమీపంలోకి వచ్చి కోతులు దాడులకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతుల బెడద వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కోతుల బెడద నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు, స్థానిక యంత్రాంగం జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.












