నిర్మల్, 2026-08-10
నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ సమీక్షించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
పాత కేసులపై ప్రత్యేక దృష్టి
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్డీపీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు కేసుల వివరాలను క్రమం తప్పకుండా నవీకరించాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ వివరాలను తప్పనిసరిగా నవీకరించాలని, మాన్యువల్ రికార్డులు, సీసీటీఎన్ఎస్లో నమోదైన వివరాల మధ్య వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని తెలిపారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు నిఘా ఉంచాలని, రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
దొంగతనాల నియంత్రణకు చర్యలు
ఇళ్ల దొంగతనాలు, వాహన దొంగతనాలు, గొలుసు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఘటనలు జరిగిన వెంటనే స్పందించి ఆధారాల సేకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తృతం చేసి, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు.
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత
ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, సంబంధిత ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు
రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నకిలీ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.












