బీసీలు అన్ని రంగాల్లో పురోగమిస్తేనే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. ఇటీవల నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన బి. శుభకరన్ ను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఇటీవల నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికై, జిల్లా కోర్టు జీపీగా కొనసాగుతున్న బి. శుభకరన్ ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య కుటుంబం నుండి మంచి స్థాయికి ఎదిగి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప వ్యక్తి శుభకరన్ ను కొనియాడారు.
శుభకరన్ జిల్లా ప్రజలందరికీ ఆదర్శప్రాయమని, రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. బీసీల సమగ్రాభివృద్ధికి సంఘం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యమని, ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రతినిధులు తెలిపారు.












