నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర అపార్ట్మెంట్లో హార్ట్ఫుల్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో, అపార్ట్మెంట్ కమిటీ సహకారంతో మూడు రోజుల పాటు ధ్యానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సొసైటీ కోఆర్డినేటర్ షరీఫ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత వంటి అంశాలపై అపార్ట్మెంట్ వాసులకు వివరంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ రాజు, నాగరాజు, నాగేష్ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ అధ్యక్షురాలు సృజన, కార్యదర్శి సాయి కృష్ణ గౌడ్, అపార్ట్మెంట్ సభ్యులు, అలాగే పొద్దుటూరు అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
గురుపౌర్ణమి సందర్భంగా కోఆర్డినేటర్ షరీఫ్, రిటైర్డ్ పీడీ ఉమా మహేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ విద్యాధికారి లక్ష్మయ్య, అపార్ట్మెంట్ అధ్యక్షురాలు సృజనలను నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాజీ జడ్పీ చైర్మన్ విఠల్రావును సైతం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ విద్యాధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్రావు ఐదేళ్లపాటు జడ్పీ చైర్మన్గా సమర్థవంతంగా సేవలందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు నడిచిన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు.
మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించడం, గురువులను సన్మానించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టమైన ఆనవాయితీ అని అన్నారు. ధ్యానం వల్ల మనిషిలోని ఒత్తిడి, కోపం, చెడు అలవాట్లు తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ధ్యానం ఏ ఒక్క మతానికే పరిమితం కాదని, అన్ని మతాలకు చెందిన వారు ఆచరించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని సూచించారు.












