హైదరాబాద్, 2026-08-23
బాల్యం అంటేనే స్వేచ్ఛ, స్వచ్ఛత. కానీ నేటి తరంలో బాల్యం క్రూరమైన నేర ప్రవృత్తికి, జల్సాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య సంఘటన పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిపై తీవ్ర చర్చకు దారితీసింది.
బాల్యం అంటేనే స్వేచ్ఛ, స్వచ్ఛత, నిర్మలత్వం. కానీ నేటి తరంలో బాల్యం క్రూరమైన నేర ప్రవృత్తికి, జల్సాలకు, వ్యామోహాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జెన్ ఆల్ఫా పిల్లలు తమ అవసరాల కోసం ప్రశ్నిస్తున్నారని సంతోషించే లోపే, అనేక కారణాలతో బాల్యం భయానకంగా మారుతోందని గ్రహించాల్సిన అవసరం ఉంది. పిల్లల మనస్తత్వాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇది కేవలం కొన్ని సంఘటనలుగానే చూడకుండా, రేపు ఒక సామూహిక తత్వంగా మారే ప్రమాదం ఉందని, అది మన ఇంటిలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నల్గొండ ఘటన సమాజాన్ని నివ్వెరపరుస్తోంది
ఇటీవల నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య సంఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది. అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా, ఇరవై ఏడుసార్లు కత్తితో పొడిచి ఆమెను హత్య చేయడం పిల్లల మనసులు ఎంత క్రూరంగా తయారయ్యాయో ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఇది ఒక్కటే కాదు, సొంత తల్లిని డబ్బు కోసం హత్య చేసిన బాలుడి ఘటన, రూపారెడ్డి హత్య వెనుక కూడా డబ్బు ప్రభావమే ఉండటం వంటివి పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. ఇంతటి నేరమయ ప్రపంచంలోకి భావితరం అడుగుపెడుతున్నందుకు ఎవరు కారకులనే ప్రశ్న తలెత్తుతోంది.
సామాజిక, ఆర్థిక ప్రభావాలు
ఈ నేరాలకు కేవలం పిల్లలే బాధ్యులని వదిలేయలేము. కుటుంబం, పాఠశాల, సమాజం.. ఇలా అందరి ప్రభావం పిల్లలపై ఉంటుంది. సమాజంలో బాగా డబ్బుండి, విలాసాలు అనుభవిస్తున్నవారు, సంపాదనలేక, ఆశలు చావక బతుకులీడుస్తున్నవారు, తేలికగా డబ్బు సంపాదించి విలాసాలు అనుభవిస్తున్నవారు.. ఇలా అనేక వర్గాలున్నాయి. తేలికగా డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పే పాఠాలు మన చేతిలోని సెల్‌ఫోన్ ప్రపంచం బోధిస్తూనే ఉంది. ఎన్ని వైపరీత్యాలను సెల్‌ఫోన్ ప్రేరేపిస్తోందో ఇంకా మనకు అర్థం కావడంలేదు. మనిషిలోని మృగత్వాన్ని మేలుకొలిపే కంటెంట్ నెట్టింట్లో విచ్చలవిడిగా కనిపిస్తోంది. అత్యంత జుగుప్సాకరమైన, భయంకరమైన దృశ్యాలను, కథనాలను ఆసక్తిగా వీక్షిస్తున్న యువత దానికి లోనవుతున్నారు.
కుటుంబ వ్యవస్థ సంక్షోభం
తల్లిదండ్రుల ప్రవర్తనలు కూడా దీనికి భిన్నంగా ఉండటం లేదు. హత్య చేసిన పిల్లలు ఒక్కరోజులోనే తయారైనవారు కాదు. కుటుంబం, పాఠశాల, సమాజం మొత్తంగా చేసిన ఉత్పత్తి అది. నేడు కుటుంబ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భార్యలు భర్తలను, భర్తలు భార్యలను చంపుకోవడం సాధారణమైపోయింది. ఆర్థికాంశాలు, భ్రమలు, వ్యామోహాల ప్రభావం పెరిగింది. అందుకు సినిమాలు, సీరియళ్లు, రీల్స్ వంటివి డర్టీ కంటెంట్‌ను విపరీతంగా చేతికి అందిస్తున్నాయి. హింస, విధ్వంసం, జల్సా, విచ్చలవిడితనం వంటివే స్వేచ్ఛగా, ఆనందంగా జీవితంగా ప్రచారం జరుగుతున్నాయి.












