తిరుపతి, 2026-08-22
చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న శ్వేతా ఘోష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, బిల్లింగ్ వివాదమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
చెన్నైలోని చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న శ్వేతా ఘోష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 13న ఆసుపత్రి భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే ఆమెను చెన్నైలోని ఎం.జీ.ఎం. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం పేరుతో ఈ నెల 20న తిరుపతిలోని అమర హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమెను తిరుపతికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21న రాత్రి 9 గంటల సమయంలో అమర హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్వేతా ఘోష్ మృతి చెందారు.
పోస్టుమార్టం, పోలీసుల దర్యాప్తు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై చెన్నై అమీంజికరై పోలీసులు క్రైమ్ నంబర్ 42/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై పోలీసుల వినతి మేరకు రేణిగుంట పోలీసుల సహకారంతో పోస్టుమార్టానికి అనుమతి కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు చర్యలు చేపట్టారు.
బిల్లింగ్ వ్యవహారంపై వివాదం
జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్‌కు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో శ్వేతా ఘోష్ గత ఏడేళ్లుగా బెంగాలీ తదితర భాషలకు అనువాదకురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చే రోగులకు ఆమె అనువాదకురాలిగా విధులు నిర్వహించేవారు.
ఆరోపణలు, బెదిరింపులు
ఇటీవల ఆసుపత్రిలో నగదు లావాదేవీలు, బిల్లింగ్‌కు సంబంధించిన అంశంపై వివాదం జరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన కల్పన అనే మహిళ ఐవీఎఫ్ చికిత్స కోసం చెన్నై ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చిన సమయంలో ఫీజులు, బిల్లింగ్ వివరాలను ఆమెకు వివరించే క్రమంలో శ్వేతా ఘోష్ వైపు నుంచి కమ్యూనికేషన్ లోపం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం, మేనేజర్లు ఆంటోనీ, బాలు నుంచి శ్వేతా ఘోష్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్వేతా ఘోష్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
సీసీటీవీ ఫుటేజీ, రికార్డుల స్వాధీనం
ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు బిల్లింగ్‌కు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్వేతా ఘోష్ మృతితో కేసు దర్యాప్తు మరింత కీలకంగా మారింది. అయితే ఆరోపణలు, అనుమానాలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.












