బంధువులు ముందుకు రాకపోవడంతో, 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' సభ్యులు మానవత్వంతో స్పందించి, మరణించిన వృద్ధుడికి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
జమ్మలమడుగు పట్టణంలో టీచర్స్ కాలనీకి చెందిన మల్లు కృష్ణారెడ్డి అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, స్థానికులు 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు, ఆదివారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం వృద్ధుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహన్, అశోక్ కుమార్, కమల్ భాష, దస్తగిరి, పి. హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మానవతా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఇది ఒకరికొకరు సహాయం చేసుకునే స్ఫూర్తిని పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 9182244150 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.











