పెద్దపల్లి, జులై 23
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండల కేంద్రంలో రోడ్లపై పశువుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు ప్రాంతాలు పశువుల సంతను తలపిస్తున్నాయని, దీనివల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తోందని వాపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా: మంథని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు ప్రాంతాల్లో పశువులను యథేచ్ఛగా రోడ్లపై వదిలివేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువుల యజమానులు వాటిని పట్టించుకోకపోవడంతో రాత్రివేళల్లో కూడా రోడ్లపైనే సేదతీరుతున్నాయి. దీంతో పగలు, రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు ప్రాంతాల్లో నిత్యం పశువులు రోడ్లపైనే సంచరించడం వల్ల ఆ ప్రాంతం పశువుల సంతను తలపిస్తోంది. రోడ్లపై యధావిధిగా పశువులు తిరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి స్థానికులకు, వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది.
కొన్నిసార్లు ద్విచక్ర వాహనదారులు వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులపాలవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ, పక్క నుంచి వెళ్లే వాహనాలపై పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












