హైదరాబాద్, జులై 09
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఈ తెల్లవారుజామున వరుస భూప్రకంపనలతో వణికిపోయింది. నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల్లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 గంటలకు 3.6 తీవ్రతతో తొలి ప్రకంపనలు నమోదు కాగా, వేకువజామున 3:23 గంటలకు 4.1 తీవ్రతతో మరో ప్రకంపన వచ్చింది.
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున వరస భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. రాష్ట్రంలోని నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఏదో అనర్థం ముంచుకొస్తోందనే భయంతో వణికిపోయారు. మొదటి భూకంపం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 నిమిషాలకు సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా రికార్డయింది.
రెండు గంటల తర్వాత అంటే వేకువ జామున 3:23 నిమిషాల సమయంలో మరోసారి భూమి ప్రకోపించింది. దీని తీవ్రత 4.1గా నమోదైంది. హింగోళి సమీపంలో 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.
ఈ భూప్రకంపనల తీవ్రత తక్కువే అయినప్పటికీ, గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని పాత్రలు నేలపై పడటం, గోడ గడియారాలు, కిటికీ తలుపులు ఊగడం వంటి పరిణామాలు గమనించిన ప్రజలు తీవ్ర భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణరక్షణ కోసం మహిళలు, చిన్న పిల్లలతో సహా అందరూ రోడ్ల మీదే గడిపారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరైనా గాయపడటం కానీ జరగలేదని అధికారులు ధృవీకరించారు.












