సమాజంలో పెరుగుతున్న కులతత్వం, స్వార్థం, విభేదాలు సామాజిక అశాంతికి దారితీస్తున్నాయని, మానవ విలువలు కనుమరుగవుతున్నాయని తెలంగాణ ఎకనామిక్ ఫోరం, కరీంనగర్ అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అన్నారు. విద్య ద్వారానే కులరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నేదునూరి కనకయ్య కరీంనగర్లో మాట్లాడుతూ, సమాజంలో కులమే బలంగా, కుట్రలే ఆయుధాలుగా మారుతున్నాయని, కుల అహంకారంతో పాటు స్వార్థం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్నేహం పేరుతో మోసాలు, సంస్కృతి పేరుతో విభేదాలు సామాజిక అశాంతికి కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కులాల మధ్య జరిగే ఘర్షణల వల్ల ప్రేమ, కరుణ, దయ వంటి మానవ విలువలు కనుమరుగవుతున్నాయని, మతం, కులం పేరుతో సమాజ విచ్ఛిన్నం జరుగుతోందని కనకయ్య అన్నారు. అణు విస్ఫోటనం కంటే కుల విస్ఫోటనం మరింత ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు.
విద్య అనేది వ్యక్తిలో సంస్కారాన్ని పెంచి, కుల అహంకారాన్ని తుంచాలని, కులరహిత సమాజ నిర్మాణానికి విద్యే చోదక శక్తిగా మారాలని కనకయ్య సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని, పరువు హత్యలకు ముగింపు పలకడానికి విద్యే మార్గమని ఆయన తెలిపారు.
సామాజిక సమత, సామరస్యం, సౌభ్రాతృత్వం, ఐక్యతలకు విద్య పునాది వేయాలని కనకయ్య అన్నారు. గుణం లేనివారు కులాన్ని, మానవత్వం లేనివారు మతాన్ని, పసలేనివారు ప్రాంతీయతను అడ్డుపెట్టుకుంటారని ఆయన విమర్శించారు. మహాకవి గుర్రం జాషువా స్ఫూర్తితో ప్రతి పౌరుడు ప్రగతిశీల సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, నేరరహిత, అవినీతి రహిత రాజకీయాలకు బాటలు వేయాలని, సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మేధావులు, యువత, మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి దుర్రాజకీయాలను అరికట్టాలని, రాజకీయ పార్టీలు సేవాభావం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. కులం కంటే గుణం, అహంకారం కంటే అభివృద్ధి, ఆందోళన కంటే ఆలోచన ముఖ్యమని, పలాయనవాదం కాదని, ప్రగతిశీలతే సమాజానికి అవసరమని, కులతత్వాన్ని రూపుమాపి, మానవత్వ పరిమళాలను వ్యాపింపజేస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని, 'వసుధైవ కుటుంబకం' భావనతో భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలని కనకయ్య పిలుపునిచ్చారు.












