మండలంలోని అష్టా గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను బుధవారం ఎంపిడిఓ లవకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సూచించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా, కూలీలు ఉదయాన్నే పనులకు వచ్చి త్వరగా ముగించుకోవాలని ఎంపిడిఓ సూచించారు. పనులకు హాజరవుతున్న కూలీలకు వేతనాలు సకాలంలో ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. కూలీలు తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలుంటే సిబ్బందిని సంప్రదించాలని సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సుమారు 300 మంది కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా, ఎంపిడిఓ లవకుమార్, ఉపాధిహామీ టిఏ యోగేష్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్ లను సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.












