ఖానాపూర్, జూలై 27
ఖానాపూర్ మున్సిపల్ పట్టణంలో రోడ్ల విస్తరణ సరిగా లేకపోవడం, రోడ్లపై పశువులు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖానాపూర్ మున్సిపల్ పట్టణంలో రహదారులు వెడల్పు పూర్తిగా చేయకపోవడం, రోడ్లపై పశువులు యథేచ్ఛగా తిరుగుతుండటంతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల్, జగిత్యాల్, మెట్పల్లి ప్రాంతాలకు వందలాది వాహనాలు, ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై తిరిగే పశువుల వల్ల వాహన చోదకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులు కూడా అసౌకర్యానికి లోనవుతున్నారు.
పశువుల యజమానులు వాటిని విచ్చలవిడిగా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో వాహనాల వేగానికి పశువులు గురై ప్రమాదాలకు గురైన సంఘటనలు, వాటి కాళ్లు విరగడం, చనిపోవడం వంటివి చాలా జరిగాయి. గత పాలకులు పశువులను గోశాలలకు తరలించిన సందర్భాలున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది కూడా అనేకమార్లు పశువులను తరలించి, యజమానులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
ఇకనైనా మున్సిపల్ అధికారులు పశువులు రోడ్లపై తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాటి యజమానులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రయాణానికి అడ్డంకులు తొలగిపోయి సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నారు.












