అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్-డివిజన్ పరిధిలోని గబ్బడా గ్రామంలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా సరైన పత్రాలు లేని 23 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో, డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 80 మంది పోలీసులు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, పాడుబడిన ఇళ్లు, గంజాయి కేసులకు సంబంధించిన నిందితుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు చేశారు. మొత్తం 200 ఇళ్లు, 250 మంది వ్యక్తులు, 100 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గంజాయి కేసులకు సంబంధించిన నలుగురు షీట్ హోల్డర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా, సరైన పత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి, చట్టబద్ధంగా మెలగాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, సమాచారం తెలిస్తే 1972 లేదా 100 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. సమాచారం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చివరగా, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు.








