నిర్మల్, జూన్ 30
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆహార భద్రతపై అధికారులతో సమావేశంలో, నిబంధనలు పాటించని ఆహార తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని అన్నారు.
జిల్లాలో ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆహార భద్రతపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు, దాబాలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని అన్నారు. వంటల తయారీలో ఉపయోగించే నూనెలు, మసాలా దినుసులు, పాలు, పెరుగు తదితర ముడి పదార్థాలు నాణ్యమైనవే వినియోగించాలని సూచించారు.
ఆహార భద్రత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి దుకాణాల లైసెన్సులు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. గడువు ముగిసిన పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, నిషేధిత రంగులు వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం వంటి పదార్థాలు తాజాగా ఉన్నాయా లేదా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం, ఇటీవల ఆహార భద్రత అంశంపై శిక్షణ పొందిన పలువురు అంగన్వాడీ ఉపాధ్యాయులకు కలెక్టర్, అధికారులు ధ్రువపత్రాలు అందించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆహార భద్రత అధికారి సునీత, జిల్లా వైద్యారోగ్య అధికారి రాజేందర్, డీడబ్ల్యూవో వినూత్న, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












