నిర్మల్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలులో పారదర్శకతను పెంచేందుకు అధికారులు నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. సోన్ మండలం పరిధిలోని గంజాల గ్రామంలో కార్మికుల హాజరును ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా పరిశీలించే ప్రక్రియను ప్రారంభించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDO) ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి స్వయంగా గంజాల గ్రామంలోని ఉపాధి హామీ పనుల ప్రదేశాన్ని సందర్శించి, కార్మికుల హాజరును ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో నమోదు చేసి, పరిశీలించారు. పనులు పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆమె అధికారులకు స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ పనుల పురోగతిని కూడా పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పనుల పరిస్థితులపై వివరాలు సేకరించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నూతన విధానం ద్వారా హాజరు నమోదులో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన ప్రతి కార్మికుడికి వేతనాలు సకాలంలో అందుతాయని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


