. ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుర్గం శేఖర్ ఆదిలాబాద్ నేతకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు
న్యూఢిల్లీ:ఆగస్టు 04 మనోరంజని తెలుగు టైమ్స్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం శేఖర్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గాన్ని ప్రకటించింది.
న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ సమావేశంలో ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ చేతుల మీదుగా దుర్గం శేఖర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై ఎస్సీ విభాగం బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం
ఆదిలాబాద్‌కు చెందిన దుర్గం శేఖర్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్నారు. కళాశాల రోజుల్లోనే ఎన్ఎస్యూఐలో చేరి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ సీ.ఆర్.ఆర్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించిన ఆయన డీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సేవలందించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, నాయకత్వంపై విశ్వాసంతో పనిచేసినందుకు ఈ అవకాశం దక్కిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
తన నియామకంపై దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్సీ విభాగం బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో పార్టీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
నాయకులకు కృతజ్ఞతలు
తనకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దళిత నాయకులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, నరేష్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తదితరులకు దుర్గం శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
తన రాజకీయ గురువు స్వర్గీయ సీ.ఆర్.ఆర్కు ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.











