కరీంనగర్, జులై 28
కరీంనగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. తనిఖీల్లో చిక్కిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి, వారి స్థానంలో వేరే వారిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కరీంనగర్ జిల్లా: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో చిక్కిన వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వారికి బదులుగా వేరే వ్యక్తులను కోర్టులో హాజరుపరిచిన ఈ వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ కేసులో ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్టు డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్లను కరీంనగర్ జిల్లా సీపీ గౌస్ అలం సస్పెండ్ చేశారు. సుమారు 130 కేసుల్లో రూ.20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను హాజరుపరిచి కోర్టును కూడా పోలీసులు తప్పుదారి పట్టించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












