న్యూఢిల్లీ, 2026-08-11
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన జైల్‌భరో పిలుపు దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు దారితీసింది. ఈ ఆందోళనల్లో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో పది లక్షల మందికి పైగా అరెస్టు అయ్యారని సంఘాలు ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన జైల్‌భరో పిలుపు దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు దారితీసింది. ఈ ఆందోళనల్లో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో పది లక్షల మందికి పైగా అరెస్టు అయ్యారని సంఘాలు ప్రకటించాయి. కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ, మోడీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ శ్రామికవర్గం, రైతులు రోడ్లెక్కారు. మోడీకో హఠావ్ దేశ్ కో బచావ్ నినాదాలతో ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రదర్శనలు, రైల్‌రోకోలు, రాస్తారోకోలు జరిగాయి.
ఆందోళనల నేపథ్యం
1942 క్విట్ ఇండియా పోరాట 84వ వార్షికోత్సవం సందర్భంగా, అమెరికా సామ్రాజ్యవాదం, కార్పొరేట్ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఎదుట బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం లొంగిపోవడానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ఆందోళనలు నిర్వహించారు. దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్న మోడీ సర్కార్‌ను రైతులు, కార్మికులు తమ ఆందోళనతో హెచ్చరించారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలకు ముగింపు పలికి, ప్రజలకు మేలు చేసే విధానాలకు కార్యరూపం దాల్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐక్యమై మోడీ సర్కార్‌ను గద్దెదించుతామని హెచ్చరించారు.
దేశవ్యాప్త ప్రతిఘటన
దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాంతాల్లో పది లక్షల మంది అరెస్టయ్యారు. రైతులు, కార్మికులతో పాటు వ్యవసాయ కార్మికులు, అంగన్వాడీ-ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించి, రోడ్లపైనే కూర్చుని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, ప్రదర్శనలు మొదలుకుని రైల్‌రోకో, రాస్తారోకో, సామూహిక కోర్టు అరెస్టుల వరకు జరిగిన ప్రతిఘటన చర్యలు ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి, తీవ్ర వేదనకు అద్దం పట్టాయి.
రాష్ట్రాల్లో ఆందోళనల తీరు
పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, త్రిపుర, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో రైతులు, కార్మికులు రోడ్లు, రైళ్లను దిగ్బంధించారు. కేరళలోని 14 జిల్లాల్లో పదివేల మంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను అడ్డుకున్నారు. అక్కడ కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోజికోడ్‌లో సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీంను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. హుగ్లీ జిల్లాలో ఆయుధాలతో కూడిన బీజేపీ గూండాలు శాంతియుత నిరసనకారులపై దాడి చేశారు. అసోంలోని ధేమాంచిలో రహదారిని గంటల తరబడి దిగ్బంధించారు. 26 జిల్లాల్లోని 31 ప్రదేశాలలో 21 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. గౌహతిలో నిరసనకారులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. మహిళలతో సహా పలువురిని రోడ్డుపై ఈడ్చిపారేశారు. తెలంగాణలోని వందలాది మందిని అరెస్టు చేశారు. ఏపీలో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. భివానీ, నుహ్‌లలో వందలాది మంది మహిళలను అరెస్టు చేశారు.












