పార్టీలో తమ ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నాలు చేయించడం సిగ్గుచేటని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రూ.2 లక్షల రుణమాఫీతో పాటు అన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని ఆయన తెలిపారు.
గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు రైతుల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని గోవింద్ నాయక్ విమర్శించారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రస్తుత సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.
మిల్లర్ల లారీల సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్షిస్తున్నారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు.
బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఆకస్మిక వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి కొనుగోలు కేంద్రాలలో కవర్లు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.











