బోథ్ నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను వరద నీటి వద్దకు వెళ్లనివ్వవద్దని, రైతులు విద్యుత్ మోటార్లు, విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు కనిపించినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు.
ప్రజల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తి చేశారు.












