ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాధుల సిద్ధులగుట్ట ఆలయానికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్లకు ఈ సందర్భంగా సన్మానం చేశారు.
ఉదయం నుంచే భక్తులు సిద్ధులగుట్టకు చేరుకొని, శివాలయంలో పంచామృతాలతో పాటు బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప, ఎల్లమ్మ తల్లి, హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు.
29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్ భరత్, 13వ వార్డు కౌన్సిలర్ కోడిసెల మల్లయ్య ఆలయానికి విచ్చేసి, శివాలయంతో పాటు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 25 ఏళ్లుగా ఆలయ అభివృద్ధికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వీరిని, ఆలయ కమిటీ సభ్యులు, ఆస్థాన మహారాజు శ్రీ ప్రాతి నందేశ్వర మహారాజు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.
సన్మానం అనంతరం, ప్రాతి నందేశ్వర మహారాజు ఆధ్వర్యంలో రామాలయం నుండి కొనేరు వరకు, తిరిగి రామాలయం వరకు పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో వెల్లివిరిసింది.


