ఢిల్లీ / చీరాల, 2026-06-05
దేశమంటే మట్టి కాదు, మనుషులు అని ఎవరో మహానుభావుడు చెప్పారు. కానీ ఆ మాటను ఆచరణలో పెడుతున్నామా మతం, కులం, రాజకీయాల పేరిట జరుగుతున్న విభజనలపై నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్ట్ డి. ప్రభుదాస్ తన ప్రత్యేక కథనంలో లోతైన విశ్లేషణ చేశారు. మేము భారతీయులం, మాకు పిచ్చి ముదిరింది అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
దేశమంటే మట్టికాదోయ్, మనుషులోయ్ అని ఎవరో మహానుభావుడు రాశారు. మేము ఆ మాటలను చదివాం, చప్పట్లు కొట్టాం, సభల్లో ప్రసంగించాం. కానీ ఆ మాటను ఆచరణలో పెట్టామా ఇదే నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్ట్ డి. ప్రభుదాస్ తన ప్రత్యేక కథనంలో ప్రశ్నిస్తున్నారు. మేము భారతీయులం, మాకు పిచ్చి ముదిరింది అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
దేశభక్తి పేరుతో విభజనలు
దేశభక్తి గురించి గొంతు చించుకునే మేమే, మతం పేరు వస్తే మనిషిని మరిచిపోతాం. కులం పేరు వస్తే పొరుగువాడిని శత్రువుగా చూస్తాం. రాజకీయ నాయకుడు చెప్పిందే నిజమని నమ్ముతాం. మేము మత బిచ్చగాళ్లం. సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా... అంటూ దేశభక్తి గీతాలు పాడుతాం, జాతీయ జెండాను చేతబట్టి ఊరేగుతాం. కానీ అదే జెండా కింద నిలబడిన మనుషులను మాత్రం మతం, కులం పేరుతో విడదీస్తాం. అదీ మా దేశభక్తి.
మహిళల భద్రతపై రాజకీయ లెక్కలు
మా తెలుగు తల్లికి మల్లెపూదండ... అంటూ తెలుగు తల్లికి పూలదండలు వేస్తాం. కానీ అదే సమాజంలో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతాం. చిన్నారులపై, మహిళలపై జరిగే దారుణాలపై రాజకీయ లెక్కలు వేసుకుంటాం. న్యాయం ఎవరి కోసం అధికారం ఎవరి కోసం అని ప్రశ్నిస్తే మాత్రం, అది రాజకీయ కుట్ర అంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తాం.
ఏడాదిలో కొన్ని రోజులు దేశభక్తి
భారత మాతకు జేజేలు... బంగారు భూమికి జేజేలు... అంటూ ఏడాదిలో కొన్ని రోజులు జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుతాం. మిగిలిన రోజుల్లో మతం పేరుతో రాజకీయాలు, కులం పేరుతో ఓట్లు, ప్రాంతం పేరుతో విభజనలు, అధికారం కోసం కొత్త కొత్త నినాదాలు ఇదేనా మన భారతీయత
ఎన్నికల్లో కులం, మతం ప్రాధాన్యత
జనగణమన అధినాయక జయహే... అంటూ జాతీయ గీతం పాడుతాం. పంజాబ్ నుంచి ద్రావిడం వరకు, హిమాచలం నుంచి గంగ వరకు దేశం ఒక్కటేనని గర్వంగా చెబుతాం. కానీ ఎన్నికలు వస్తే నీ కులం ఏంటి నీ మతం ఏంటి నీ ఓటు ఎవరికి అంటూ మనిషి విలువను ఓటు పెట్టెతో కొలుస్తాం.
ప్రశ్నిస్తే తీవ్రవాది, మౌనంగా ఉంటే దేశభక్తుడు
జాతీయ జెండాను గుండెల మీద పెట్టుకుంటాం, ఇంటి మీద ఎగురవేస్తాం, దేశ గౌరవం గురించి ప్రపంచానికి గొప్పగా చెబుతాం. కానీ దేశంలోనే అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూస్తాం. ప్రశ్నిస్తే తీవ్రవాది నిలదీస్తే ఉద్యమకారుడు విమర్శిస్తే దేశద్రోహి అధికారాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే దేశభక్తుడు వాహ్... ఏమి ప్రజాస్వామ్యం












