ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయ ప్రయాణాలు ప్రభావితమయ్యాయి. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు సహా పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమానాశ్రయానికి సమీపంలో జరిగిన భారీ పేలుడు, ఆకాశంలో క్షిపణుల కదలికలు ప్రయాణికుల్లో భయాందోళనలు సృష్టించాయి.
బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్న పీవీ సింధు, దుబాయ్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ గగనతలాన్ని మూసివేయడంతో, విమానాశ్రయం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సింధు, ఆమె కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రతామా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఒక భారీ పేలుడు సంభవించిందని, పొగ, శిథిలాల మధ్య నుంచి కోచ్ సురక్షితంగా బయటపడ్డారని సింధు సోషల్ మీడియాలో తెలిపారు.
ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినిపించాయని, పరిస్థితి నిమిషానికీ భయంకరంగా మారుతోందని సింధు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు, భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి సింధు బృందాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని సమాచారం. ఈ సమయంలో తమకు అండగా నిలిచిన దుబాయ్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు సింధు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాము విశ్రాంతి తీసుకుంటున్నామని, యుద్ధ మేఘాలు తొలగి పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ప్రముఖ నటుడు మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్న సమయంలో ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్లడం, వాటిని గాలిలోనే అడ్డుకుంటున్న భారీ శబ్దాలు తమను భయాందోళనకు గురిచేశాయని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. దుబాయ్ గగనతలంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వేలాది మంది ప్రయాణికులు, వారి కుటుంబాలు కూడా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.


