మిర్యాలగూడ, 2024-07-21
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తోందని, ఇక్కడ ఇప్పటివరకు 395 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మురళి నాథ్ ఉక్కడల తెలిపారు. ఈ విజయంతో ఆసుపత్రి కిడ్నీ చికిత్స విభాగంలో ఒక అరుదైన రికార్డును సృష్టించింది.
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తోందని, ఇక్కడ ఇప్పటివరకు 395 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మురళి నాథ్ ఉక్కడల తెలిపారు.
మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్కై ప్లాజా హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ లో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అనుభవజ్ఞులైన వైద్య బృందంతో, ప్రముఖ హెచ్.ఓ.డి. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖరా చక్రవర్తి నేతృత్వంలో అందిస్తున్నామని తెలిపారు.
395 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది బాధితులకు పునర్జన్మను ప్రసాదించామని, కిడ్నీ చికిత్స విభాగంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఒక అరుదైన రికార్డును సృష్టించిందని డాక్టర్ మురళినాథ్ పేర్కొన్నారు.
సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్తపు గ్రూపులు కలవడం ప్రధానం అయినప్పటికీ, యశోద హాస్పిటల్స్ బృందం బ్లడ్ గ్రూపులు వేరుగా ఉన్న రోగులకు కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించి, వారందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేయడంలో విజయం సాధించిందని ఆయన వివరించారు.
శస్త్ర చికిత్సల విషయంలో వయసు ఒక అడ్డంకి కాదని యశోద వైద్యులు నిరూపించారని, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి వారి ఆయుష్షును పెంచడంలో కీలకపాత్ర పోషించామని తెలిపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు.
కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులకు డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కిడ్నీ మార్పిడి వలన రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన అన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ బృందం సాధించిన 395 ట్రాన్స్ప్లాంట్లు కేవలం సంఖ్య మాత్రమే కాదని, 395 కుటుంబాలలో వెలుగులు నింపామని పేర్కొన్నారు.
రక్తపు గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమే అన్న అవగాహన ప్రజలలో పెరగాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో ప్రతి 100 మందిలో 20 మందికి కిడ్నీ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయని, బీపీ, షుగర్ తదితర వ్యాధులు ఉన్నవారు క్రియాటిన్ పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ మార్కెటింగ్ హెడ్ గంగుల చంద్రకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.












