అత్యవసర సేవలందించే ఆసుపత్రులకు డీజిల్ ను ప్రత్యేకంగా సరఫరా చేసేలా అధికారులు చొరవ చూపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నాయకులు డాక్టర్ మువ్వా రామారావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్ కొరత నేపథ్యంలో ఆసుపత్రుల జనరేటర్లకు ఇంధనం అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటిలేటర్లపై ఉన్న పసి పిల్లలకు, కార్డియాలజీ విభాగంలోని కేతలాగ్ మిషన్లకు జనరేటర్లు తప్పనిసరి అని, అవి పనిచేయడానికి డీజిల్ అవసరమని డాక్టర్ రామారావు తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించడానికి, ఆపరేషన్ థియేటర్లలో శస్త్ర చికిత్సలు చేయడానికి జనరేటర్ల వినియోగం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. జనరేటర్లు పనిచేయకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి వినియోగదారులకు ఇంధనం సరఫరా కావడం లేదని, ఈ నేపథ్యంలో ఆసుపత్రుల జనరేటర్లకు కూడా డీజిల్ దొరకడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు.
పెట్రోల్ బంక్ యజమానులు ఈ విషయమై చర్చించి, ఏదో ఒక బంకులో అత్యవసర సేవలకు గాను ఆసుపత్రులకు డీజిల్ అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








