హైదరాబాద్, 2026-06-05
గోమూత్రం ఔషధ గుణాలపై ఇటీవల జరుగుతున్న చర్చలు, అధికారిక వర్గాల నుంచి వస్తున్న మద్దతు నేపథ్యంలో, శాస్త్రీయ దృక్పథంతో ఈ అంశాన్ని విశ్లేషించడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం విశ్వాసాల ఆధారంగా కాకుండా, కఠినమైన శాస్త్రీయ పరిశోధనల ద్వారానే ఏ అంశాన్నైనా నిర్ధారించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యాయనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు.
విద్యావేత్తల మద్దతు, విస్మరిస్తున్న అంశాలు
గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు.
అధికారిక మద్దతుతో కొత్త ధోరణి
గోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
పక్షపాత వైఖరితో పరిశోధన
ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరించాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు.
గోమూత్రానికి ఆపాదించే విలువ
గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది.












