నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవా దృక్పథంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో, కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఓపీల వివరాలు, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.
ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అవసరమైన మందుల కోసం వెంటనే ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్ని రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని, రోగులకు సమాచారం అందేలా స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












