వేసవి తాపం పెరగడంతో పాటు, కోతులు, వీధి కుక్కలలో దూకుడు పెరిగి ప్రజలపై దాడులు చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నిర్జలీకరణం, మాతృత్వ రక్షణ వంటి కారణాలు ఈ దూకుడుకు దారితీస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తీవ్రమైన ఎండల వల్ల జంతువులలో అసౌకర్యం, చికాకు పెరిగి, అవి తమ సమీపంలోకి వచ్చే వారిని శత్రువులుగా భావించి ఎదురుదాడి చేస్తున్నాయని అధికారులు తెలిపారు. బయట నీటి వనరులు ఎండిపోవడంతో నిర్జలీకరణం (Dehydration) సమస్యతో అవి మరింత ఉద్రేకంగా ప్రవర్తిస్తున్నాయని నిపుణులు వివరించారు.
వేసవిలో పిల్లలకు జన్మనిచ్చే తల్లి కుక్కలు తమ పిల్లలను కాపాడుకునే క్రమంలో అదనపు అప్రమత్తతతో ఉంటాయని, తెలియక దగ్గరకు వెళ్లిన వారిని కరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, వీధి కుక్కలు, కోతులు గుంపులుగా ఉన్న ప్రాంతాలకు అనవసరంగా వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించారు.
చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, కుక్కపిల్లలు ఉన్న ప్రాంతాలకు వారిని వెళ్లనివ్వద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ఇంటి బయట లేదా డాబాలపై కుండల్లో నీటిని ఉంచడం వల్ల వాటి దాహం తీరి, శాంతించే అవకాశం ఉందని తెలిపారు.
ఎండలో నీరసించి ఉన్న జంతువులను రాళ్లతో కొట్టడం లేదా కర్రలతో బెదిరించడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అలా చేస్తే అవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకవేళ కుక్క లేదా కోతి కరిస్తే, గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు.












