హైదరాబాద్, 2024-11-20
జీవితం ఒక ప్రయాణమైతే, మనిషి వేసే ప్రతి తప్పటడుగు అందులో ఒక మలుపు. కొన్ని మలుపులు గమ్యాన్ని చేరుస్తాయి మరికొన్ని మనిషిని తన నుంచే దూరం చేస్తాయి. అయితే ఎంత దూరం వెళ్లిపోయినా తన మూలాలను, తన మనుషులను, తనలో ఇంకా మిగిలివున్న మంచితనాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చే అవకాశం మనిషికి ఉంటుంది. ఆ తిరుగు ప్రయాణమే కొన్నిసార్లు అసలైన జీవితయాత్ర అవుతుంది. సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత పా. ముత్తుకుమారన్ రచించిన తమిళ నాటకం తొడరుమ్ పయణంగళ్ ( ) అటువంటి జీవిత ప్రయాణాన్నే రంగస్థలానికి తీసుకొచ్చిన ఒక సామాజికకుటుంబ నాటకం.
జీవితం ఒక ప్రయాణమైతే, మనిషి వేసే ప్రతి తప్పటడుగు అందులో ఒక మలుపు. కొన్ని మలుపులు గమ్యాన్ని చేరుస్తాయి మరికొన్ని మనిషిని తన నుంచే దూరం చేస్తాయి. అయితే ఎంత దూరం వెళ్లిపోయినా తన మూలాలను, తన మనుషులను, తనలో ఇంకా మిగిలివున్న మంచితనాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చే అవకాశం మనిషికి ఉంటుంది. ఆ తిరుగు ప్రయాణమే కొన్నిసార్లు అసలైన జీవితయాత్ర అవుతుంది. సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత పా. ముత్తుకుమారన్ రచించిన తమిళ నాటకం తొడరుమ్ పయణంగళ్ ( ) అటువంటి జీవిత ప్రయాణాన్నే రంగస్థలానికి తీసుకొచ్చిన ఒక సామాజికకుటుంబ నాటకం.
37 సంవత్సరాల పూర్తికాల పాత్రికేయ అనుభవం కలిగిన ముత్తుకుమారన్ దినమలర్ దినపత్రికలో రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దినమణి దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేశారు. 1985లోనే కథా రచయితగా తన సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయనకు మనిషిని దగ్గరగా పరిశీలించే పాత్రికేయ దృష్టి, అతని అంతరంగాన్ని అక్షరాల్లోకి తీసుకొచ్చే కథకుడి సున్నితత్వం రెండూ ఉన్నాయి. ఆ రెండు లక్షణాల సంగమం ఈ నాటకంలో కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితం దినమలర్ వరమలర్లో చిన్నకథగా ప్రచురితమైన ఇతివృత్తాన్ని రచయిత ఇప్పుడు నాటక రూపంలో పునఃసృజించారు. కథను నాటకంగా మార్చడం కేవలం ప్రక్రియా మార్పు కాదు. కథలో రచయిత వివరించే జీవితాన్ని నాటకంలో పాత్రలు జీవించాలి; సంఘటనలు ప్రేక్షకుడి కళ్లముందు జరుగుతున్న అనుభూతిని కలిగించాలి; సంభాషణలే పాత్రల మనస్తత్వాన్ని మోసుకెళ్లాలి. ఈ సృజనాత్మక సవాలును ముత్తుకుమారన్ స్వీకరించడం అభినందనీయం.
నాటక నేపథ్యం, కథాంశం
నాటకం మద్యం, మాదకద్రవ్యాల చీకటి ప్రపంచాన్ని స్పృశిస్తూ ప్రారంభమై క్రమంగా కుటుంబ సంబంధాల అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న శేబేసన్, విమోచన కోసం తన స్వస్థలమైన క్లియాపట్టుకు తిరిగి వస్తాడు. తన మొదటి భార్యను, వికలాంగుడైన కుమారుడిని వెతుక్కుంటూ సాగే అతని ప్రయాణం క్రమంగా తనను తాను వెతుక్కునే అంతర్యాత్రగా మారుతుంది. అందుకే శేబేసన్ ప్రయాణం భౌగోళికమైనదానికంటే మానసికమైనది. వ్యసనాలకు బానిసైనప్పుడు నష్టపోయేది ఒక వ్యక్తి శరీరం మాత్రమే కాదు. కుటుంబం గాయపడుతుంది. బంధాలు బీటలు వారతాయి. నమ్మకం కూలిపోతుంది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతనితో ముడిపడిన అమాయకులు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ సామాజిక వాస్తవాన్ని కుటుంబ నేపథ్యంతో మన ముందుంచడం ఈ నాటకంలోని ముఖ్యమైన బలం.
తాత్విక చింతనలు
రచనలో అక్కడక్కడా మెరిసే తాత్విక వాక్యాలు నాటకానికి మరో అంతస్తును నిర్మించాయి. ప్రతి వ్యక్తి తన భారాన్ని తానే మోయాలి అనే భావన వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తుంది. డబ్బు మన అవసరాలకు సరిపడా ఉన్నంతవరకు మనం దానికి యజమానులం అది మన జీవితాన్నే నియంత్రించే స్థాయికి చేరితే మనిషే దానికి బానిస అవుతాడనే భావన మరింత సమకాలీనమైనది. ఇది కేవలం ధనం గురించిన వ్యాఖ్య కాదు. మద్యం కావచ్చు, మాదకద్రవ్యాలు కావచ్చు, సంపద కావచ్చు, అధికారం కావచ్చుఏదైనా మనిషి అదుపులో ఉన్నంతవరకే సాధనం; మనిషినే అదుపులోకి తీసుకున్న క్షణం నుంచి అది సంకెళ్లు. మరణం గురించిన నాటకంలోని ఆలోచన మరింత లోతైనది. మరణం ఒక క్షణంలో అకస్మాత్తుగా మొదలయ్యే ప్రయాణం కాదని, పుట్టుకతోనే మనిషి దాని వైపు ప్రయాణించడం ప్రారంభిస్తాడనే తాత్విక దృష్టి జీవితపు అనిత్యతను గుర్తుచేస్తుంది. తేదీ తెలియకపోవచ్చు; ప్రయాణం మాత్రం అనివార్యం. ఈ సత్యాన్ని గ్రహించడం నిరాశకు కాదుఉన్న జీవితాన్ని మరింత అర్థవంతంగా, బాధ్యతగా జీవించడానికి దారితీయాలి.












