‘మిషన్ పరివర్తన’ కార్యక్రమంలో భాగంగా స్థానిక దీక్ష జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘మత్తు రహిత భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పెహచాన్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా యువతకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత యాంత్రిక జీవన విధానం, ఒత్తిడి కారణంగా కొంతమంది యువత మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవడం ఆందోళనకరమని, వాటికి బానిస కావడం జీవితాన్ని నాశనం చేసుకోవడమేనని కలెక్టర్ పేర్కొన్నారు. యువత దృఢ సంకల్పంతో వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగానికి బానిస కాకుండా విలువైన సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, గొప్ప శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
పేదరికం, చదువుల ఒత్తిడి, ఇతరులతో అనవసర పోలికలు వంటి కారణాలతో యువత మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. మత్తు రహిత భారత్ నిర్మాణం కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పరశురాం, మానసిక వైద్యులు అల్లాడి సురేష్, కళాశాల ప్రధానాచార్యులు వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










