సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్‌ల మధ్య యోగా విద్యలో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు యోగా శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందం ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం యోగాలో వివిధ స్థాయిలలో కోర్సులను అందించనుంది. పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో యోగా శిక్షణను విస్తృతంగా అందిస్తోంది.
విద్య, కార్పొరేట్ రంగాలలో యోగా శిక్షకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. అసిస్టెంట్ యోగా టీచర్ కోర్సులో భాగంగా 100 గంటల శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారు. ముఖ్య యోగ శిక్షకుల శిక్షణను పతంజలి యోగ పీఠం, హరిద్వార్ పర్యవేక్షణలో అందిస్తారు. ఈ శిక్షణ పొందినవారు సమాజానికి ఉచిత యోగా సేవలు అందించాలి.
వైసీబీ కోర్సులను లెవెల్ 1 నుంచి 4 వరకు శిక్షణ ఇచ్చి, ఆయుష్ డిపార్ట్మెంట్, యోగ సర్టిఫికేషన్ బోర్డు ద్వారా సర్టిఫికేషన్ అందిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది ఇప్పటికే వివిధ విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు పొందారని కృపాకర్ తెలిపారు. గతంలో ఈ కోర్సుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్థానికంగానే పూర్తి చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు.








