కామారెడ్డి, 2026-08-08
పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయాలని, ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీవో నంబర్ 25ను సవరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయాలని, ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీవో నంబర్ 25ను సవరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టీపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చకినాల అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
దశలవారీగా పోరాటాలు
పీఆర్సీ ప్రకటించే వరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆగస్టు 21 నుంచి 26 వరకు రాష్ట్ర, జిల్లా బృందాలు పర్యటించి జిల్లా కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ చేపడతామని ప్రకటించారు.
ఉపాధ్యాయుల పనుల సర్దుబాటు
జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల పనుల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా, జీవో నంబర్ 25 నిబంధనల ప్రకారమే జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను, 50 మంది విద్యార్థులున్న పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. నూతన జిల్లాలకు జిల్లా విద్యాశాఖాధికారి, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఉప విద్యాశాఖాధికారి, అన్ని మండలాలకు మండల విద్యాశాఖాధికారి పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బదిలీలు, పదోన్నతులు, పెన్షన్ విధానం
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సేవా కాలానికి వెయిటేజీ ఇవ్వాలని, ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షను సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.











