వేసవి శిబిరాలు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, అంతర్గత ప్రతిభ వెలికితీతకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని జుమ్మెరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని సందర్శించారు.
కలెక్టర్ భవేశ్ మిశ్రా శిబిరంలో విద్యార్థులతో ముచ్చటించి, వారి వివరాలు, భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ శిబిరానికి హాజరు కావాలని, ఆటలు, పాటలు, యోగా, డ్యాన్స్ వంటి వివిధ అంశాలపై శిక్షణ పొందాలని విద్యార్థులకు సూచించారు. పిల్లలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేసవి శిబిరాల ద్వారా పిల్లల నైపుణ్యాలు పెరగడమే కాకుండా, వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు విద్యార్థులకు అన్ని విషయాలను చక్కగా నేర్పాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, అందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తారని, అధైర్యపడకుండా ఆయా సబ్జెక్టులను శ్రద్ధగా చదవాలని ప్రోత్సహించారు. సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.












