బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు చెన్నాడి జగన్ మోహన్ రావు, కరీంనగర్లోని రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన అనుభవంతో మార్గనిర్దేశం చేస్తూ సేవలందిస్తున్నారు. ఆయన సేవాభావం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటోంది.
జగన్ మోహన్ రావు పదవీ విరమణ అనంతరం కూడా విద్యార్థుల పట్ల తనకున్న అభిమానంతో సేవల కొనసాగిస్తున్నారు. రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయన తనదైన శైలిలో విద్యాబోధనతో పాటు జీవిత పాఠాలను నేర్పిస్తున్నారు.
స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రావు తన సొంత గ్రామం పట్ల చూపిస్తున్న అభిమానంతో పాటు, గ్రామ అభివృద్ధికి కూడా సహకరిస్తానని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి, ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు. ఆయన నిస్వార్థ సేవ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ చంద్రగిరి అశోక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.











