ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కవాతు, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల (PTM) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. దిలావర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. "మన బడి–మన బాధ్యత" నినాదంతో బడి బాట కవాతు నిర్వహించారు.
ఉపాధ్యాయ బృందాలు ఇంటింటికి వెళ్లి, బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. జిల్లా వ్యాప్తంగా నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమావేశాలు కూడా నిర్వహించారు.
పాఠశాలల్లో జరిగిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశంలో, విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యసన పురోగతి వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.












